Tuesday 3 December 2013

శ్రీ గురుభ్యోన్నమః 

ఈ లేఖనమునకు స్పూర్తి VVS శర్మ గారి ప్రచురణ. వారికి నా ధన్యవాదాలు . 

కారణ జన్ములైన గురువుగారిని గూర్చి తెలియడము బ్ర.శ్రీ. సామవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారానే. వారు ,నేను చెన్నపట్టణం లో విరుగంబాక్కం లో వుండేవాళ్ళం. వారి ఋషిపీఠము మొదటి నెల ప్రతి నేను చూసినవెంటనే శర్మ గారికి ఫోను ద్వారా నా అభినందనలు తెలియబరచి ,నాకు అందుబాటులోవున్న సరస్వతీదేవి విగ్రహమును తీసుకొని, వారు చెప్పిన చిరునామా ప్రకారము వారి ఇంటికి  ,శాశ్వత చందా చెక్కు తీసుకొని బయలుదేరివెళ్లి ఆయనను కలిసిన మొదటిరోజు మరువలేను. 'దదాతి ప్రతిఘృణ్ణాతి ...' అని చెప్పినారు పెద్దలు . సహవాసము కోరువారు శక్తిమేరకు సంతోషపూర్వకముగా ఇచ్చిపుచ్చుకొనుట  జరుపవలెను. అది సాంప్రదాయము. నేను ఇచ్చిన సరస్వతీ ప్రతిమకు ప్రతిగా వారు ఇచ్చిన 'నీలకంఠేశ్వర శతకము' 'అగ్ని'శివపదము' పుస్తకము మరియు కేసెట్టు (c.d. లు అప్పుడు లేవు) ఇప్పటికీ నేను భద్రపరచుకొన్న అపురూపమైన వస్తువులు. చెక్కు వారికి ఇచ్చి దాదాపు ఒక గంట మాటలాడి తిరిగి ఇల్లు చేరినాను. అప్పటినుండి అప్పుడప్పుడు మా మధ్యన రాకపోకలుండేవి . ఒకరోజు 7,8 గంటల సమయము దంపతీ సమేతముగా, మాతోగడిపి మా ఆతిథ్యమును స్వీకరించినరోజు మేము మరచుటకు వీలుకాదు. ఎన్నోమార్లు వారి ఇంటికి నేను పోయినపుడు వారి మిత్రులెందరి తోనో పరిచయము చేయుటయే గాక ఎన్నో ధార్మిక విషయముల గూర్చి మాతలాడుకొనే వాళ్ళం. వారి మొదటి ఉపన్యాసము మొదలు చేన్నపట్టణమున జరిగిన ప్రతి ఉపన్యాసమునకు వారు నాపై అభిమానముతో పిలువడము నేను వేడలడము జరిగినది. 
కాలాంతరములో వారు హైదరాబాదు రావటము పిదప ఒక ఏడాది తరువాత నేను రావడము తటస్తించినది కానీ కలియ వీలు పడలేదు. తిరిగీ నా 'రామమోహనుక్తి రమ్యసూక్తి'కి పరిచయ వాక్యాలు వారు వ్రాస్తే నా మనసుకు తృప్తియని తలచి వారి వద్దకు వెళ్ళినాను. వారి గౌరవ సంపద ఎంతపెరిగినా వారి ప్రేమాభిమానములలో మంచిమనసులో మార్పు రాలేదు. తన కార్యభారము కొండంత వున్నా నా కోరిక తీర్చిన అభిమాన మూర్తి ఆయన. 
ఇప్పుడు వారిని కలియుట అంట సులభము కాదు పైగా వారున్న చోటుకు నేనున్నా చోటుకు చాలా చాలా దూరము. అందుకే ఎప్పుడూ ఆ అనుభవాలే మదిలో మెదలుతూ వుంటాయి. 

'దూరస్తోపి సమీపస్తో యోవై మనసి వర్తతే 
యోవై చిత్తేపి దూరస్తో సమీపస్తోహి దూరతః' అన్నది పెద్దల మాట. 
ఎవరైతే మనసులో నిలచిపోతారో వారు దూరమున్నా దగ్గర ఉన్నట్టే. ఎవరైతే మనసులోలేరో వారు దగ్గరున్నా దూరమైనట్టే. 

వే. షణ్ముఖ శర్మ గారిని మొదట కలిసినప్పుడు మాటల మధ్యలో గురువు గారి ఆశీస్సులతోనే ఈ  ఋషి పీఠం పత్రిక్జ ప్రారంభము చేసినట్లు చెప్పినారు. అటుపిమ్మట గురువుగారి వాక్కులు పత్రికలో చదువుట మొదలుపెట్టి మానసికముగా నా నడయాడే గురువుగా వారిని భావించినాను. నా అర్ధాంగికి అకస్మాత్తుగా ఒక పెద్ద ఆపరేషన్ చేయవలసి వచ్చింది. హైదరాబాదులోని ఒక పేరుమోసిన హాస్పిటలుకు పొతే 15,000 రూపాయలవరకు టెస్టులకే జమకట్టించుకొన్నారు. నా మనసుకు వారి వ్యాపార దృక్పథము  నచ్చక నాకు పుత్రికా సమానమైన Dr. లలిత(M.D.) కి ఫోన్ చేస్తే ఆమె తత్కాల్ లో టికెట్టు బుక్ చేసుకొని బయలుదేరి వెంటనే రమ్మని చెప్పింది. నేను అదేవిధంగా చేసినాను. ఒక ఆదర్శ ప్రాయమైన వ్యక్తిని గూర్చిన తలంపు వచ్చినపుడు ఎందుకు ఆదర్సప్రాయురాలో చెబితే బాగుంటుంది. మేము హైదరాబాదులో బయలుదేరిన రాత్రే ఆమె భర్తకు పెద్ద అచ్సిదెంటు జరిగి విశాఖ సెవెన్ హిల్స్ హాస్పిటల్ లోని ఇంటెన్సివ్ కేర్ లో చేర్చినారు. దానికితోడుగా ఆమె మరిది(భర్త స్వంత తమ్ముడు)అదే రోజు చనిపోయినాడు. అయినా ఆమె తన మాట వెనుకకు తీసుకోకుండా, స్నేహితులు వారించినా వినకుండా మమ్ముల రప్పించి అటు ఇటు అన్నివిషయములనూ సమర్తవంతముగా నిర్వహించిన ధీరోదాత్త ఆమె. ఇన్నివుండీ మాకు మంచి జరుగవలెనని తన వాహనములో గురువు గారి వద్దకు తన వాహనములో పిలుచుకొని పోయినది. 
భీమిలి ఐతే చేరినాము కానీ సమయము ముగిసినది గురువుగారు దర్సనానికి అందుబాటులో లేరని చెప్పినారు. నిరాశకు గురియైనమాకు ఒక వటువు కనిపించి నేను తీసుకు వెడతాను రండి అని పిలుచుకుపోయినాడు. స్వామిని తనివితీరా చూసినాము. భాగ్య వశమున గురువుగారితో మాట్లాడే అదృష్టం దొరికింది. నా శ్రీమతిని విశాఖకు పిలుచుకు వచ్చిన కారణం చెబుతూనే చింత పడవలసినది లేదు. ఆపరేషన్ సక్సెస్ అయి చక్కగా కోలుకొంటుంది అన్నారు. వారి ఆశీర్వాదము భగవదనుగ్రహము Dr. లలిత అభిమానము ఆవిడను ఈ ఎకాకికి దక్కించినాయి . నేను గురువుగారితో నాకేదైనా మంత్రోపదేశము చేయమని అర్థించినాను. వెంటనే వారు పంచాక్షరి చేస్తున్నారుకదా అదే కొనసాగించండి అన్నారు. తల ఊపుత తప్పించి నా నోట మాట రాలేదు. కృతజ్ఞతతో నాగుండె నిండిపోయింది. ఇక Dr. లలితా భర్తను గూర్చి కూడా నేనే అడిగినాను. ఆయన i.c.u. లో వున్నట్లు ముందే చెప్పినాను కదా, ఇక ఒక డాక్టర్ గా ఆమెకు తనభర్తది ఎంత విషమ స్థితియో ఆమెకు తెలుసు. ఆమెకు ఎక్కువగా నమ్మకము కూడాలేదు. గురువుగారు ప్రశాంత చిత్తముతో భయపడవలసిన అవసరము లేదు ఇబ్బందులను దాటుకొని నయమౌతాడని చెప్పినారు. ఆయన నిజంగానే మృత్యుద్వారమునుండి వెనుదిరిగినాడు . ఇది వారి దయాచిత్తదర్శనము . 
వారిని గూర్చిన నా మనోనివేదన :

కందుకూరి గురువు కరుణ పూరితమైన 
చూపు కొరకు ఎదురు చూచుచుంటి 
వారి దయను పొందు వారధి యా చూపే 
దానిపొందితేని ధన్యుడగుదు 

వారి మనసు గాంచ వారిది యద్దాని 
సీమనంతియున్న సికతమేను 
అలకు ప్రేమ చేర్చి యలవొక వారంప 
మునిగి తెలుచుంటి ముదము మీర 

మనసు నచ్చినట్టి మారాజు మా స్వామి 
వారి వత్సలతన వరలునట్టి 
భాగ్యమొకటి దొరికే భావింపగా మాదు 
పూర్వ జన్మ యొక్క పుణ్య ఫలము 

కందుకూరి గురుపడం కామితార్థ సుఫలదం 
చరణ కమల స్పర్శనం సకల పాప భంజనం 

శివానంద గురు శ్రేష్ఠం శిష్య మందార సన్నిభం 
సంకరోటి మహాభాగో చారుశీతల వీక్షణా 

వారిని గూర్చి ఎంత చెప్పినా తక్కువే . 

తత్సత్

No comments:

Post a Comment