Tuesday 10 December 2013

నా మదిలో నిలచిన 'శల్యుడు'

ఏమిటి ఈయన నా మదిలో శల్యుడంటున్నాడు, శల్యునివలె ఇతనుకూడా దుర్మార్గుడేనా అనుకొంటారెమో, నా విషయమట్లుంచితే శల్యుడు దుర్మార్గుడు కాదు. ఇది నా మనసున నాటుకొన్న మాట . పరిస్థితుల ప్రభావము అతనిని చెడ్డ వారి చెంత చేర్చినా మాట నిలుపుకొన్న మానధనుడు. నా చేతనైనంత వరకు నా మాట నీటి మూట కాదని తెలియజేసే ప్రయత్నము చేస్తాను. చేయలేకపోతే నా తప్పు మన్నించి నన్ను వదిలివేయగలరు. 

మాన్యులైన యువ పాఠకులకు మరొక ముఖ్యమైన విజ్ఞప్తి. భారతము చరిత్ర. ఇది పుక్కిటి పురాణము కాదు. నేను పండితుడనూకాను పౌరాణికుడనూకాను. యువత మన పూర్వుల ఘనత తెలిపే ఈ రసభరిత చరిత మనః పూర్వకముగా చదివితే విజ్ఞుల వద్ద వినునపుడు ఇంకా బా గుగా అర్థము చేసుకోగలరు. నా ఈ చిన్ని యత్నము వమ్ము చేయరని ఆశిస్తాను. చదవకుండానే లైకులు కొట్టవద్దు. 

భారతమునకు 'జయ'మను నామము కూడా కలదు . శాస్త్ర వచనమేమిటంటే 'యతోధర్మస్తతోజయః'. గీతా వచనమేమిటంటే 
'అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్.' అన్నీ కలిపి చూస్తే భగవంతుడు ధర్మము  వైపు నిలిచి అధర్మముతో యుద్ధము చేసి ధర్మ ప్రతిష్ఠాపన గావించినాడు. యుద్ధము అంటే చతుర్విధోపాయాలున్నాయి. సామ దానాలు పనిచేయలేదు కావున భేద దండోపాయాలే అనుసరించ వలసి వచ్చింది భారత యుద్ధములో. ఈ భేదోపాయములోని భాగంగానే భీష్మ,ద్రోణ,కర్ణ శల్యాదులను చంపుట. ఒక్కొక్కరి విషయములో ఒక్కొక్క విధమును అనుసరించుట జరిగినది. 

కురుక్షేత్ర యుద్ధ ఆరంభములో ధర్మరాజు శిరస్త్రాణము కవచము పాదరక్షలు వదిలి కురుసైన్యములోనికి పోయి భీష్మునికంజలించి ఆయన ఆశీర్వాదము కోరుతాడు . అందుకు భీష్ముడు సంతసించి ఈ విధేయత నీవు ఏకారణము చేతనైనా చూపకుండి యుండినచో  నిన్ను శపించి యుండెడి  వాడనని చెబుతాడు. అట్లు చెబుతూ నీ వినయమునకు సంతసించితిని నీకు జయమగు గాక అని దీవించుతాడు. అదికాక కౌరవులచేత పోషింపబడు వాడనైనందున యుద్ధము చేయవలడను కోరిక తప్పించి వేరేదైనా కోరిక కోరమంటాడు. ఆత్మ లో తర్జన భర్జన చేసుకొని మిక్కిలి వినయముతో,hypocrisy కాదు,అంటే వంచన చేయు ఉద్దేశ్యముతో కాదు , అడిగితె ఇప్పుడవసరము లేదు తగిన సమయములో చేబుతానంటాడు. (భీష్మ 43 అ 37 నుండి 42,47)ఇదే విధంగా భీష్ముడు కర్ణునితో కూడా యుద్ధము జరుగబోయే ముందు నీవు పాండవ  పక్షము చేరితే ఈ యుద్ధమే ఆగిపోవగలదని చెబుతాడు. కానీ కర్ణుడు చెవియొగ్గడు. ఎవరి ధర్మము వారు వీడక యుద్ధమునకు ఆయత్తులౌతారు. ఇట్లు లోతుకు వెళ్ళేకొద్దీ ధర్మమే మనకు గోచరించుతుందికానీ అధర్మముకాదు. 

ఈ సందర్భములో మరొక్క విషయము మనవి చేసుకొంటాను. వ్యాస భారతములో శ్రీకృష్ణుడు ఉపప్లావ్యమునకు పోవునపుడు కర్ణుని తన రథములో ఎక్కించుకొని పాండవ పక్షమున చేరమని సలహా ఇస్తాడు కానీ ద్రౌపది నీకు గూడా భార్య ఔతుంది అనడు. ప్రాతః కాలము మొదలు ఆరవ కాలమైన నిశాముఖమందు (ప్రాతః, సంగవ,మధాహ్న, అపరాహ్ణ,సాయం, నిశాముఖమ్) పట్టాభిషేకము జరుగగా ద్రౌపది బంగారు వెండి మట్టి కడవలతో వివిధ సుగంధ వనస్పతులతో అభిషేకించును అని చెప్పినాడు. 
అంతేకానీ పాండవులతోబాటు నీకూ పట్టమహిషి అగునని చెప్పలేదు. తిక్కన గారి భారతములో ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పద్యములో ఈ విధముగానున్నది:'పాంచాల రాజ పుత్రిక అంచితముగ నిన్నుబొందు నార్వుర వరుసన్' అని చెప్పగా తిరుపతి వేంకటకవులు తమ పాండవోద్యోగములో 'ఆ సతి పెళ్లియాడుగద ఆరవ భర్తగ సూర్యనందనా ' అని వ్రాసినారు . ఇక్కడ ఆర్వుర వరుసన్ అన్నది కాలమునకే గానీ ఆరవభర్త కాదని బ్ర.శ్రీ,వే. మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు తమ ధర్మప్రసంగములలో చెప్పియున్నారు. ఇదంతా ఎందుకు చెప్పవచ్చినానంటే ఒక లక్ష శ్లోకములు గల భారతమునక్షరమక్షరము గుర్తుంచుకొనుట ఏదో కొందరికి, మల్లాది వారు ,సామవేదం వారు,చాగంటి వంటి వారికే సాధ్యము.మనము గుర్తుంచుకొన వలసినది మనకు స్థూలముగా అధర్మమని గోచరించు విషయములెన్నో ధర్మవిదితములే యని . అసందర్భమనుకోకుంటే హిమాలయ ప్రాంతాలలో  దుర్యోధనునికి గూడా గుడి వున్నదని విన్నాను. ద్రౌపదిని కూడా కలుపుకొని ఒక్క పాండవుల విషయములో తప్ప అతనిని తప్పు పట్టు వీలు   మనకు భారతములో దొరుకదు. 

ఇక శల్యుని విషయమునకు వస్తాము.మద్రి దేశ యువరాజైన శల్యుడు, ఎన్నో దేశాల  జయించి వచ్చుచుండిన పాండురాజునుగాంచి ఆతనికి వివాహమున తన చెల్లెలినిచ్చి మైత్రి చేసుకొంటాడు. ఆయన సకల యుద్ధవిద్యలయందును పారంగతుడు. గదాయుద్ధమందును,ఖడ్గ చాలనమందును,అస్త్ర శాస్త్ర ప్రయోగమునందును,అన్నిటి కన్నను  మిన్నగా  ఆశ్వ శాస్త్ర పారంగతుడు. మాద్రి సహగమనముతో భర్తను అనుసరించిన తరువాత శల్యుడు, ఆమె పుత్రులైన, నకుల సహదేవులను తనవెంట తీసుకుపోయి మద్ర దేశాధీశులుగా చేయ సంకల్పించినా వారు కుంతీదేవి తోనే వుంటామంటారు . సహదేవునికి తన తమ్ముని కుమార్తె విజయను ఇచ్చి పెళ్లి చేస్తాడు. పాండవులు అజ్ఞాతవాసము నుండి వచ్చిన తరువాత ఉపప్లావ్యములో వారిని కలిసి రాబోవు యుద్ధమునకు మద్దత్తుగా తన వెంట ఒక అక్షొహిణి సైన్యమును తీసుకొని శల్యుడు మద్ర నుండి బయలుదేరుతాడు. ఇక్కడ శల్యుని వీరత్వమును గూర్చి చెప్పుకోవాలి . అతని బలహీనత మదిర, మగువ . అతనప్పటికే వయసులో పెద్దవాడు కానీ గొప్ప యోధుడు. అతను బహుళాస్త్ర శాస్త్ర పారంగతుడు గదాయుధ్ధమునందు  ఆరితేరినవాడు కృష్ణునితో ఢీకొనగల ఆశ్వ చాలకుడు.ఈ విషయాలు ముందే చెప్పుకొన్నాము కూడా.  ఇవియన్నియు తెలిసే దుర్యోధనుడు కుయుక్తిపన్ని అతని బలహీనతపై దెబ్బ కొడతాడు. బలహీనతా వివశుడైన శల్యుడు ఈ వసతులన్నీ కల్పించినది ధర్మరాజని భ్రమపడి ఈ వసతులు కల్పించిన వానికి తన మద్దత్తు ప్రకటించుతాడు. అప్పుడు సుయోధనుడగుపించి అసలు విషయం చెబుతాడు. శల్యుడు, తన వారికి అప్రియమైనా సరే, ఇచ్చిన మాట దాటక ఒక సారి ధర్మజుని కలిసి తనవద్దకు వస్తానని మాట ఇస్తాడు. 

శల్యుడు చెప్పినదంతా విని,ధర్మరాజు జరిగిన దానికి తన మనః పూర్వక సమ్మతినితెలిపి ఒక్క విషయము లో ఆయన సలహా కోరుతాడు . ఎటుదిరిగీ కౌరవులు శల్యుని కౌశలము తెలిసినవారైనందున కర్ణునికి సారధి కమ్మన వచ్చు అట్టితరి కర్ణుని నిగ్రహించు ఉపాయమడుగుతాడు. చివరకు కర్ణుణ్ణి మానసికంగా నిరుత్సాహ పరచడానికి ఒప్పుకొంటాడు శల్యుడు. 

శల్యుడు మదిరా వ్యసనపరుడు. ఆ మాటకొస్తే ఆ కాలములో మధువు ఎవరికినీ నిషేధము కాదు. ఈ కాలములో మాదిరే కొందరు అతి కొందరు మితము. యుద్ధ సమయములో శల్యుడు కర్ణున్ని దేప్పిపొడుస్తూవుంటే కర్ణుడు అతన్ని అతని వంశాన్ని అతని దేశాన్నే, మీరు కల్లు  తాగిన తరువాత అమ్మ పాలు తాగేవారంటాడు. అట్లని శల్యుడు మానధనుడు కాదు అని చెప్ప
వీలులేదు. అసలు మొదట దుర్యోధనుడు కర్ణునితో కూడా శల్యునివద్దకు పోయినపుడు కర్ణుని రథ సారథి కమ్మంటే సూతపుత్రునికి రాజులు రథసారధులు కావాలని అడుగుటయే తప్పంటాడు. దుర్యోధనుడప్పుడు ఆశ్వ శాస్త్రములో ఆయనను కృష్ణుని మించినవానిగా కీర్తిస్తాడు.అందుకు సాక్ష్యం ఆయన మేనల్లుడైన నకులుడు తంత్రీపాలునిగా అశ్వరక్షకుడై విరాటుని కొల్వులో వుంటాడు. అదియునుగాక దేవ వైద్యులైన అశ్వనీ దేవతల వరప్రసాదుడు కూడా కదా. కర్ణుడే స్వయంగా దుర్యోధనుని అశ్వహృదయము తెలిసిన శల్యుడు తన సారధి అయితే తాను సులభంగా అర్జనుని గెలువగలనంటాడు. శల్యుడు దుర్యోధనుని మాటకు మెచ్చి సరే యని అంటూ నేను  నా మనసుకు తోచిన మాటలు మాట్లాతాను, కర్ణునికి సమ్మతమైతే నాకూ సమ్మతమే అంటాడు. అతను ధర్మజునికిచ్చిన మాట ఆ విధంగా నిలుపుకొన్నాడు. మత్తులో వున్నా మాట తూల లేదు. 

17 వ రోజున కర్ణుని మరణానంతరము సైన్యాధ్యక్షుణ్ణి ఎవరిని చేయాలని ప్రశ్నించినపుడు అశ్వథ్థామ, కృతవర్మ కృపాచార్యుల ముందే వీర ధీర శూరుడైన శల్యుడే తగినవాడని చెబుతాడు. అది శల్యుని మాన్యత. కర్ణుని చావుకు అతను కూడా ఒక కారణమని వారెవరూ నిందించలేదు. కృష్ణుడు అర్జనుని ప్రక్కన వుంటే కర్ణుడు గెలువలేడని వారికి తెలుసు. పైపెచ్చు కర్ణుడు నాగాస్త్రము సంధించునపుడు శల్యుడు గుండెకు గురి పెట్టమన్నా కర్ణుడు తనపైన తనకున్న ధీమాతో కంఠానికే  గురి పెడతాడు. కృష్ణుడు రథాన్ని భూమిలోనికి తన కాలితో అదమగా ఆ అస్త్రము అర్జనుని కిరీటమును తొలగించి వెళ్ళిపోతుంది, అది ఒకసారే వాడవలెను కాబట్టి . 18 వ రోజున ధర్మజునితో పోరు సల్పునపుడు  ధర్మరాజ,సాత్యకి, భీమ ,నకుల సహదేవులందరూ ఒకాసారిగా శల్యుని పై విజృంభించగా అందరినీ మూర్ఛాగ్రస్థులను చేస్తాడు. దుర్యోధనుడది చూసి శల్యుడు వారిని చంపినాడనుకొంటాడు.    

ధర్మరాజు మనస్సులో " శ్రీకృష్ణుడు నన్ను శల్యుని చంపమని నియోగించినాడు. "ఆమహానుభావుని మాట వమ్ము అయ్యేలా ఉంది. ఇక నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు " అనుకుని రధము మీద నిలబడి " ఓ పరమేశ్వరా ! నీవు త్రిశూలధారివి, నిర్గుణుడివి, నిరాకారుడివి, త్రినేత్రుడివి. సృష్టి, స్థితి, లయ కారకుడివి. త్రిభువనములకు పూజనీయుడివైన నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను నన్ను ఈ గండం నుండి కాపాడు " అని మనస్పూర్తిగా ప్రార్ధించి మెల్లగా లేచి శల్యుడి మీద శరప్రయోగం చేస్తాడు. ధర్మరాజు శక్తి హీనుడయ్యాడని తెలుసుకుని శల్యుడు రెట్టించిన ఉత్సాహంతో ధర్మరాజు మీద బాణములు వేస్తాడు. భీమసేనుడు మధ్యలో వచ్చి శల్యుని విల్లు విరిచి హయములను చంపుతాడు. శల్యుడు కూడా విరధుడౌతాడు. కత్తి డాలు తీసుకుని తన వైపు వస్తున్న శల్యుడి మీద తన శక్తిని అంతా ప్రయోగించి ధృడసంకల్పంతో   తన వద్ద పూజలందుకుంటున్న పరమేశ్వర ప్రసాదితమైన శక్తి ఆయుధమును బయటకు తీసి భక్తితో నమస్కరించి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ క్రోధంగా ప్రళయకాల రుద్రునిలా శక్తి కొద్దీ విజృంభించి తన వైపు వస్తున్న శల్యుని మీద గురి చూసి బలంగా విసిరాడు. ఆ శక్తి ఆయుధం నిప్పులు కురుస్తూ శల్యుని వైపు దూసుకు పోయి అతడి కవచమును చీల్చుకొని గుండెలను దూసుకుంటూ భూమిలోకి పోయింది. శల్యుడి శరీరం నుండి రక్తం ధారాపాతంగా కారింది. మొదలు నరికిన చెట్టులా శల్యుడు నేల మీద బోర్లా పడ్డాడు. శల్యుడి ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయినాయి. ఇంత యుద్ధము చేసి ఒక మహా వీరునిగా మరణించుతాడు  శల్యుడు . 
తనను నమ్ముకొన్న దుర్యోధనుడు దుష్టుడని తెలిసియు, ధర్మరాజాదులకు మేనమామ అయివుండియు, కృష్ణుడున్నవైపే 
జయము నిశ్చయమని తెలిసియు కేవలము తాగిన మైకములో ఇచ్చిన మాట నిలుపుకొనుటకు తన ప్రాణాలనే వదలిన మాన ధనుడు . 

చెప్పిన మాటకు కట్టుబడి కర్ణుని నిరుత్సాహపరచుట వల్ల శల్య సారధ్యమన్నమాట లోకోక్తిగా మారింది కానీ శల్యుడు మాట నిలుపుకొన్న మహారాజు . 

తత్సత్ 

No comments:

Post a Comment