Thursday 21 November 2013

కపర్దీ కాపాడు

శివునికి కాలకాలుడు అన్నపేరు కలదు. ఆయన యమునికి యముడు. ఆయనను ఒకసారి తలచుకొందామని తలంపు.
ఇది సీస పద్యము.
ఇంద్ర గణములారు ఇన గణమ్ములు రెండు
పాద పాదమునకు బరగు చుండు
ఆటవెలదియైన తేటగీతియునైన
చెప్పవలయు తుదిని సీసమునకు

ఇందు యతి నియమముంది కానీ ప్రాస నియమము లేదు. ప్రాస అంటే పద్యముయోక్క ప్రతి పాదములోను  రెండవ అక్షరము తానుగా కానీ గుణింతముతో కూడుకొని గానీ రావలయును. ప్రాసనియమము లేకున్నను ఈ సీసమునందు ప్రాస నియమము పాటించి వ్రాయ ప్రయత్నించినాను. ఈ ప్రాస కొంత దుష్కరము కూడా. ఈ మాటలు జిజ్ఞాసువుల కొరకు వ్రాసినాను. పొగరుతో వ్రాసిన మాటలు కావు.

కర్ణామృతంబైన కథల కారకుడీవు

వర్ణాల కందని వస్తువీవు

వర్ణనా తీతమౌ వర భూరుహము నీవు

పర్ణఛాయల నీదు బరగనివ్వు 

జీర్ణమైతిని విధి చీర్ణ సమ్మెట పోట్ల

చూర్ణమైపోనట్లు చూడుమయ్య

కీర్ణుండ  జరచేత శీర్ణుండ బ్రతుకనే

ఆర్ణవం దాటించు పూర్ణ పురుష


బాల్యమన్దున బుద్ది నే బడయనైతి

యౌవ్వనపు క్రొవ్వు తోడ నిన్నరయనైతి

కాలునకు చేరువగునేడ కలిగే బుద్ధి

కాలకాలుడ కావుమా కరుణ తోడ

పరమేశ్వరా!

చెవులకింపైన కథలు కల్గినవాడవు, అక్షరాలకు అందనివాడవు అంటే వర్ణనాతీతుడవు,  పొగడలేనంత మహిమలుకలిగిన కల్పవృక్షము నీవు, నీ నీడలలో నన్ను ఉండనివ్వు. విధి యొక్క ఉలి సమ్మెట పోట్లకు బాగా గురియైన వాణ్ణి. నేను పొడి పొడి కాకుండా చూసుకో. ముసలితనముచేత కప్పబడి చిక్కిన  వాడను . ఈ బ్రతుకనే సముద్రము దాటించు మహానుభావా.

చిన్న వయసు లో బుద్ది వికసించ లేదు. యౌవ్వనములో క్రోవ్వుతో కళ్ళు కనిపించ లేదు. యమునికి చేరువైతినని తెలిసినతరువ్వత నాకు బుద్ది కలిగింది. యమునికి యముడైన మహాప్రభో నన్ను కాపాడు తండ్రీ.



No comments:

Post a Comment