నేను వ్రాసిన ఈ పద్యానికి కాస్త అర్థము చెప్పే ప్రయత్నము చేస్తాను
మామ మామ మీకు మా సంపదలనిచ్చి
మసల జేయు మంచి సంతు నిచ్చి
మామదీశు నతము మది నిల్పి నుతియించి
మంచి పొందగలరు మరల మరల
మామ మామ అంటే మామకు మామ అని. లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు విష్ణువుకు మామ . అదే విధంగా గంగ విష్ణువు పాదముల వద్ద పుట్టుట వల్ల (హరి పాదోద్భవ ) ఆయన కుమార్తెయై సముద్రుణ్ణి కలవటం వల్ల, సముద్రుడు తిరిగి విష్ణువుకు అల్లుడైనాడు. అంటే విష్ణువు సముద్రునికి మామ అయినాడు . ఇది మామ మామకు అర్థము.
మా అంటే లక్ష్మి లేక సిరి. కాబట్టి మాసంపదలు అంటే సిరిసంపదలు అని. మా అంటే మహా లేక గొప్పగా అధికముగా అనే అర్థము కూడా వుంది . అంటే మీకు ఐశ్వర్యము అధికముగా ఇస్తూ మంచి సంతాన సౌభాగ్యాన్ని కూడా కలిగించాలి అని అటువంటి, మామదీశు అంటే లక్ష్మీదేవి మనసుకు అధిపతి యైన వాడు,అంటే విష్ణువును కలకాలము భక్తితో ప్రార్థించుతూ మీరు కోరుకొనే మంచినెల్లా పొందగలరు అని నాకు తెలిసిన అర్థము.
No comments:
Post a Comment