నేటి తలిదండ్రులు
రామకృష్ణ గారు చాలా మంచి విషయాన్ని స్పృశించినారు. మొదటి పేరా లో వారు వ్రాసిన అభిప్ర్రాయముతో ఏకీభవిస్తున్నాను . నేటి యువతకు తాతల తరము నాది. బహుశా రామకృష్ణ గారిది తండ్రుల తరము కావచ్చును . ఈ తరము నేటి యువతది. మా తండ్రిగారి తరము లో పూర్తిగా ఇల్లాలు ఇంటికే పరిమితము. అప్పుడు అన్ని పనులూ ఇల్లాలు చెసుకొనుటయే కాకుండా దేవుని వత్తులు చేసియో విస్తరాకులు కుట్టియో ఎబ్రోయిడరీ పని చేసియో వెడినీళ్ళకు చల్ల నీళ్ళను జత జేసేవారు. అవ్వ తాతలు పిల్లలను కనిపెట్టుకొని వాళ్ళకు ఎన్నో అనుభవాలు చెప్పేవారు.
మా కాలములో గోలీలు ,బొంగరాలు, బిళ్ళంగోడు మొదలగు ఖర్చులేని ఆటలు, అంటే అన్నీ కలిపినా ఒక రూపాయి అయ్యేదికాదు,వుండేవి. కాని ఆ ఆటల్లో లక్ష్యము, గురి, సాధన, పట్టుదల,గెలువవలేనను ఆకాంక్ష ఉండేవి. రోగనిరోధక సామర్థ్యము పెరిగేది. ఆటల్లో గాయమైతే చాలా మెత్తటి మట్టిని, భూమి పై ఉన్న మట్టిని చేతితో చెరిగి ( నేమి అంటే బరువు పదార్థము దిగజార్చి తేలిక పదార్థము నిలుచునట్లు), గాయము పై వేసే వాళ్ళము. ఈ విషయంలో తల్లి దండ్రుల ప్రమేయము వుండేది కాదు. పాఠ్యాంశాలు ఇప్పుడున్నవే కానీ అందులో పాఠాల బరువు తక్కువ . ఉపాధ్యాయులకు తమకు తెలిసినది చెప్పవలసిన మేరకు సుబోధకముగా పాఠము యొక్క పరిధిని దాటకుండా, ఒక్కొక్కసారి దాటి కూడా, చెప్పేవారు. ఇప్పుడు పాఠము చెప్పుటకన్నా ఏవేవో ఊహాజనిత ప్రశ్న లను అంతర్జాలమున చూచి ఇవ్వగా వారి శిష్యులు కూడా ఇంటికి వచ్చి అందులోనుండి నే జవాబులు చూసి వ్రాస్తున్నారు.ఇప్పటి ఆటలకు ఎంత ఖర్చౌతోంది అనేది ఒక్క సారి గమనించితే అర్థమౌతుంది. ఇంట్లో మా అమ్మమ్మ (నేను నాకు మొదటి సం. దాటుతూనే తల్లిని పోగొట్టుకొన్నాను. తదుపరి మా తండ్రి పునర్వివాహము చేసుకోకుండా నా సంరక్షణా భారాన్ని ఆమెకు ఒప్పజెప్పి భగవత్సాయుజ్యము చేరువరకు నా బాగు కే పాటుబడినారు. మా అమ్మమ్మ కూడా కన్నతల్లి లేదన్న చింత నాకు కలగనీకుండా పెంచింది. వారి ఋణము నేను ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేనిది.) అన్ని రకాల పిండివంటలు చేసిపెడితే నిక్కరు జేబులనిండా పోసుకొని తింటూ మట్టిలోనే ఆదుకొనేవాణ్ణి . ఆ 'ఇమ్మ్యునిటీ' నే ఇప్పుడు నన్ను కాపాదుతోన్దని అనుకొంటున్నాను. ఇవన్నీ నా గొప్ప కోసం కాదు ఆనాటి సాంఘీక పరిస్థితులను గూర్చి చెప్పుచున్నాను.నేను చదువు పూర్తీ జేసి సంపాదన అవసరము లేని భార్యనే కావాలని పెళ్ళిచేసుకొన్నాను . నేను సాంఘీకముగా వెనుకబడిందేమియు లేదు. 'పెన్నీ సేవ్డ్ ఈస్ పెన్నీ అర్న్డ్' అన్న ఆంగ్ల సామెతను అక్షరాలా నిజాము చేసింది ఆ ఇల్లాలు.
కాలం మారింది. భార్య భర్త ఉద్యోగాలకు పోతేకాని సంఘం లో అంతస్తు, ఆర్ధిక పెంపుదల అన్న అపప్రధలు బెల్లము చుట్టూ మూగిన ఈగలైపోగా ఇద్దరూ ఆఫీసులకు కదిలినారు.ఒకటి పొందాలంటే ఒకటి పోగొట్టుకోవలసిందే.తల్లి తండ్రి వృద్ధాశ్రమము పాలైనారు. పిల్లలు అమ్మ చేయిమారి ఆయమ్మ చేతికి చేరినారు. అనువంశీకమైన ఆచారాలు అటకెక్కినాయి. వేల సంవత్సరముల సంస్కారం సాంప్రదాయాలు కరి మ్రింగిన వెలగ పళ్ళై పోయినాయి . ఈ తరం వారు ఇంటిపట్టు చదువు కంటే పట్నం చదువులకు ప్రాముఖ్యత ఇచ్చుట చేత ఇంటి ఆచార వ్యవహారాలు గమనించే అవకాశాలను పోగొట్టుకొన్నారు. పులి మీద పుట్రలా అతిశయించిన ఆంగ్ల భాషా ప్రభావము,ఆదరము లేని అమ్మ భాష అన్నీ నేటి స్థితికి కారణాలు. ఇంతకూ మునుపొకసారి నేను చెప్పిన పద్యం గుర్తుకొస్తున్నది .
నరవర నీచే నాచే
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవునిచే
నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్
అది నేటి దుస్థితి . ఎప్పుడైనా తండ్రి తో వెళ్ళే కొడుకు దారి లో కనిపించిన దేనినో చూపించి 'నాన్నా అదేంది' అంటే ' చ! నీకు తెలియదు నోరు మూస్కో'అన్నాడట. అసలు విషయమేమిటంటే తనకే తెలియదని కదా. అందువల్ల పిల్లలు గాలిపటాలై పోతున్నారు. తెగితే అధోగతే.అంటే
జ్ఞానము పిల్లలు సముపార్జించే అవకాశమే పోగా వాళ్ళు అంతర్జాలాన్ని ఆశ్రయించి వారి వయసుకు నిషిద్ధములైన విషయాలపై దృష్టి మరల్చుతున్నారు . తల్లిదండ్రులకు తీరికలేక కార్పొరేట్ స్కూళ్ళలో చేర్చి ఎక్కువ డబ్బు కట్టినాము కదా ఎక్కువ చదువొస్తుంది
అనుకొంటున్నారు. చదువు బజారు దినుసు కాదు. ఈ కార్పొరేటు స్కూళ్ళలో విద్యార్థికి ఎక్కువ శాతం మార్కులు వచ్చినట్లు భ్రమింపజేసే గారడీలు కొన్ని వున్నాయి. ఆ గారడీలతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. మా వానికి 99% మా వానికి 99.9% అని ఊగిపోయెటట్లు చేస్తున్నారు తల్లిదండ్రుల్ని.నేటి చదువుల గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే :
ఏనాటి అగ్రహారమొ
మా నాటికి మాన్యమాయె మా పని దీరన్
మీ నాటి కండ్రిగాయెను
నానాటికి తీసికట్టు నాగంభోట్టూ
అన్నట్లు తయారయ్యింది.
ఇక రెండవ విషయం 'ఏకాగ్రత తో ఒకే పని చేస్తే ఆలోచనాశక్తి క్షీణిస్తుంది. పిల్లలు పది రకాలు గా ఆలోచించాలి.'
ఆలోచన , ఏకాగ్రత నా దృష్టి లో భిన్న ధృవాలు. ఆలొచనలుంటే ఏకాగ్రత పని చేయదు. ఏకాగ్రత వుంటే ఆ దరికి ఆలోచన రాకూడదు.
కానీ విద్యార్థికి రెండూ కావలసిందే. పాండవులే గెలవాలనే ఆలోచన గురువు డ్రోణునికీ వుండినది శిష్యులు పాండవులకు వుండినది. ఏకాగ్రత తోనే విద్యను సాధించి వైరులపై విజయము సాధించినారు.ఇక ఏకాగ్రత చిట్కాలంటె, చెప్పే\ఇచ్చే దానికంటే, ఇచ్చే వానిమీద నమ్మకము వుండాలి.
ఇక మూడవ విషయానికొస్తే టీచర్ల విషయం లో వారితో నేను ఏకీభవించుచున్నాను.మన సాంప్రదాయములో శిష్యునికి'గురువు' వుంటాడుగానీ టీచర్ (బోధకుడు) ఉండడు. గురుత్వము అన్న మాటకు ఇంగ్లీషులో అర్థం 'డెన్సిటీ.' 'గురువు'జ్ఞానమునకు తోడుగా
సమయస్పూర్తి , విద్యార్థి పై శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇంగ్లీషు లో 'కమిట్మెంట్' అంటారు. దీనికి ఈ ఉపనిషద్వాక్యము తార్కాణము :
ఓం సహనావవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహైః
తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై
గురుశిశ్యులమైన మనలను భగవంతుడు రక్షించు గాక. మనలను పోషించు గాక. మనము ఊర్జిత శక్తితో పరిశ్రమించెదముగాక. మన స్వాధ్యాయము ఎకాగ్రము ఫలవంతము అగుగాక. మనము ద్వేష రహితులమై నడచుకొందుముగాక . ఇది గురుకులవిద్య గురుశిష్య సంబంధము .
ఇక ఉద్యోగాల విషయానికొస్తే ఆర్ధిక స్తోమత,ఉద్యోగావసరమును బట్టి ప్రయత్నాలుంటాయి .టెండూల్కర్ తో కూడా క్రికెట్ నేర్చుకొన్న వాళ్ళందరూ అంతటి గొప్పవారు కాలేదు. ఒక సారి సహస్రావధాని వేదముర్తులు మాడుగుల నాగఫణి శర్మ గారితో ముచ్చటించేటపుడు ఆయన అన్న ఒక మాట నా మనసుకు హత్తుకొని పోయింది. 'ఆ శ్రీ మాత దయ వల్ల నేనీ స్థితి లో ఉన్నానుగానీ నాకన్నా ఎందరో పండితులు, విద్వాంసులు ఉన్నారన్నారు. 'దానే దానే పె ఖానేవాలేకా నాం లిఖ్ఖా రహ్తాహై' అంటే ఇదేనేమో .
నేను ఈ నాలుగు మాటలు వ్రాయడానికోప్పుకొన్న రామకృష్ణ అదూరి గారికి కృతజ్ఞతలు.
ఓం తత్సత్
No comments:
Post a Comment