Sunday, 9 February 2014


మాట - వరహాల మూట 

మాట వలన జరుగు మహిలోన కార్యముల్
మాట వలన పెరుగు మైత్రి ,కనగ
మాట నేర్వకున్న మనుగడ లేదిది
రామమోహనుక్తి రమ్య సూక్తి
నా ఉద్దేశ్యంలో మాటకు ఇంత ప్రాధాన్యత వుంది. మాటే జంత్రము(సంగీత వాద్యము)మాటే మంత్రము ,మాటే యంత్రము ,మాటే తంత్రము. 
గాలికి కదిలే మీ కురులు వేయి వీణలై నా హృదయములో అనురాగ రాగాన్ని మీటుతున్నాయి అంటే అప్పుడు మాట జంత్రమేకదా. (జంత్రమంటే సంగీత పరికరమని ఒక అర్థము)
సరియైన సమయములో సరియైన సలహాచేప్పి సమస్యను సర్దుబాటు చేయగలిగిన నిజమైన స్నేహితుని మాట మంత్రము కాదా!
సమయానికి సాయపడే యజమాని మాట మనలను యంత్రము లాగా పనిచేయనివ్వదా!
నేటి రాజకీయ దుస్థితికి కారణము చితంబర తంత్రము కాదా !
అన్నీ మాటలే. కొన్ని తేనే ఊటలు కొన్ని బంగారు గొలుసు పేటలు, కొన్ని నీటి మూటలు. కొన్ని తుపాకీ తూటాలు, కొన్ని పదును కత్తులు, కొన్ని నక్క జిత్తులు. కానీ సుమతి శతక కారుడు మాటను, సత్యము అనే ఒక మేకు తో గోడకు తగిలించినాడు. అదేమిటంటే 'మాటకు ప్రాణము సత్యము' అన్నాడు. ధృతరాష్ట్రుడు భారతములో తన కొడుకు చర్యలు సరియైనవి కావని చెబుతూనే తనకు గల పుత్ర వ్యామోహము ఆ విధంగా చేయిస్తున్నదని బాధ పడతాడు. కర్ణుడు తాను కుంతీ పుత్రుడని తెలిసిన పిదప గూడా తన మాటకు కట్టుబడి దుర్యోధనునితో ఉండిపోతాడు. యుద్ధానికి ఆరంభములో ధర్మజునికి, తగిన సమయములో తన మరణ రహస్యము తెలిపెదనని తాను ఇచ్చిన మాటకు కట్టుబడి భీష్ముడాతనికి తన మరణ రహస్యమును ఆ విధంగానే తెలుపుతాడు . అంటే మనపూర్వుల సత్య నిష్ఠా గరిష్ఠత ఇందు మూలముగా మనకవగతమౌతుంది. ఇందులో మంచి వారు చెడ్డవారు అన్న తారతమ్యము లేదు.

వినదగు నెవ్వరు చెప్పిన
వినిననంతనే వేగుపడక వివరింపదగున్
కనికల్ల నిజాము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ

ఇది సుమతి శతక కారుని ఇంకొక పద్యము. సక్రమముగా వినుట, లేక మనసు పెట్టి చదువుట, విన్నది ఆకళింపు చేసుకొనుట,ఆకళింపు చేసుకోన్నదాని అర్థమేరిగి ప్రవర్తించుట మనిషి కి చాలా ముఖ్యము.

మనసు మాటలోన మాటేమొ పనిలోన
పనికి పట్టుదలను పదిలపరచి
కష్ట పడెడు వాడు కడు గొప్ప వాడురా
రామ మొహనుక్తి రమ్య సూక్తి

అంటే మాట త్రికరణ శుధ్ధి గా ఉండాలన్న మాట.

ఇక విమర్శను గూర్చి ఒక్క మాట. విమర్శ అంటే ఎదుటి వారికి బాధ కలిగించుట కాదు. ఒకమాట ఎట్లుండాలనే దానికి
సుమతి శతకకారుని మాటే కొలబద్ద :

ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ

అని అన్నాడు.
దీనిని సరదాగా నేను ఇంగ్లీషుతో కలిపి ఇట్లు చెప్పినాను (యతి ప్రాసలు చూడవద్దు, నవ్వొస్తే నవ్వుకొండి )

ఎప్పటికెయ్యది వాంటెడొ
అప్పటికా టాకు టాకి అన్యుల హార్టుల్
హర్టింపక హర్టవ్వక
ఎస్కేపై తిరుగు వాడు ఎక్స్పర్ట్ సుమతీ

అసలు ఒక చాటువు మాటను గూర్చి ఎంత మంచిమాట చెప్పిందో చూడండి

మాటలచేత దేవతలు మన్నన చెంది వరంబులిత్తురున్
మాటలచేత భూవరులు మన్నన చెంది పురంబులిత్తురున్
మాటలచేత భామినులు మన్నన చెంది మనమ్బులిత్తురా
మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్

తల్లి తన సంతుకు మొదటి గురువు. ఒక వ్యక్తిని చూపి యితడు మీనాన్న అంటే అది ఆశిశువు తక్షణము గ్రహించుటయే కాక నాన్న అని పిలుస్తూ అనుబంధము ఏర్ప్రచుకోవడము జరుగుతుంది. తండ్రి వ్రేలు పట్టుకు నడుస్తూ ఎన్నో విషయాలు తెలుసుకొన్న పిదప గురువుకు అప్పగించడం జరుగుతుంది. 'గురువు' 'teacher' కు సమానార్తకము కాదు. teacher అంటే one who teaches. అతని బాధ్యత అక్కడితో ముగుస్తూంది. 'గురుత్వ'మది కాదు. అసలు గురుత్వము అంటే 'density',అంటే గాఢమైన అని అర్థము . పాఠము చెప్పి ఇక పోయిరమ్మనుట కాదు గురువు యొక్క బాధ్యత.శిష్యుడు తనంతవాడయ్యేవరకు తన చత్ర ఛాయ (గొడుగు నీడ)లోనే వుంచుకొంటాడు కావున వానిని ఛాత్రుడు అన్నారు. ఎంత మంచి మాటో చూడండి.అదే student అనే మాటకు one who studies అనే గదా అర్థము. కావున గురుశిష్య సంబంధమునకు teacher--student సంబంధమునకు హస్తిమశకాన్తరము, అజగజ సామ్యము,పర్వత పరమాణు సారూప్యము. కావున గురువు ఏమి మాట్లాదవలె ఎట్లు మాట్లాదవలె ఎంత మాట్లాడవలె అన్నవి కూడా తన శిక్షణ లో భాగంగా చెబుతాడు. అందుకే నేనంటాను:

అమ్మ మాట సద్ది యన్నంపు మూటౌను
అయ్యా మాట చూడ అందు పెరుగు
గురువు గారి మాట గురుతుంచు లవణము
రామమోహనుక్తి రమ్య సూక్తి

మనకు నచ్చని విషయాలు సూన్నితగా చెప్పడమనేది ఒక కళ. ఇందులో చెప్పేవానికి చెప్పించుకొనే వానికీ అవగాహన వుంటే వారి మధ్యన పోరపోచ్చులు రావు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ :
పెళ్లి పెత్తనానికి వచ్చిన అబ్బాయి యొక్క తండ్రి ఒక కుర్చీ పై కూర్చొని, మిగత నలుగురిముందు భార్యతో ఇట్లన్నాడు. ఇందూ ! రా యిలా కూర్చో. చెప్పింది ఒక మాటే అయినా అర్థాలు మాత్రము రెండు. ఒకటి నా ప్రక్కనవచ్చి కూర్చో ఐతే రెండవది మాట్లాడకుండా రాయి లాగా కూర్చోమనుట. ఇది ఆమెకు మాత్రమే అర్థమౌతుంది. ఎందుకంటే వారి మధ్యన అవగాహన వుంది కాబట్టి.

మాటకున్న ఇంకొక ప్రాధాన్యత చూస్తాము

భర్తృహరి సుభాషితాలలో 'విద్యా దదాతి వినయం'అన్న ఒక శ్లోకాన్ని ఈ విధమైన పద్యంగా తెనుగించినారు ఏనుగు లక్ష్మణ కవి గారు.

"విద్య యొసగును వినయమ్ము, వినయమున బాత్రత, బాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు దానివలన ఐహికాముష్మిక

సుఖంబులందు నరుడు".

మనము నేర్చుకొనే విద్య వినయప్రదానమై వుండాలి. అప్పుడే మనలపెద్దల ఆదరమును పొందే పాత్రత లభించుతుంది. పాత్రత వలన

అంతా మంచే జరుగుతుంది. జిజ్ఞ్యాస, వయసు తో నిమిత్తము లేకుండా, అందరికీ ఉండవలసిందే. అడిగే పధ్ధతి ఎదుటివారికి

ఆనందము కలిగించాలి. కొందరి మాటలు వింటే మొక్క బుద్ద్ఘి పుడుతుంది కొందరివి వింటే మొట్ట బుద్ది పుడుతుంది. మన మాటలో

ఎపుడూ నిజము నిజాయితీ నిండి ఉండాలి, నిండుకొని గాదు(అంటేఅయిపోవడం. )

అసలింకొక మాట చెప్పవలసినది వుంది.
నీతి శతకములో ఒక శ్లోకము ఈ విధంగావుంది .

సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న భ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ్ నానృతమ్ భ్రూయాత్ ఏషా ధర్మః సనాతనః

అంటే ఎదుటి వ్యక్తికి సంతోషము కలిగించే నిజము చెప్పవలె. నిజమైనా కష్టము కలిగించేది చెప్ప గూడదు. అట్లని ప్రియమును చేకూర్చే అబద్ధ మాడరాదు. ఇది మన పురాతన ధర్మము.

హనుమంతుడు మారు వేషములోవెళ్లి మొదటి సారి రామలక్ష్మణులను చూసి వారిని ప్రశ్నించిన తీరును రాములవారు వాల్మీకి

రామాయణము లో ఈ విధంగా మెచ్చుకొంటాడు :

నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః

న సామవేద విదుషః సక్యమేవాభ్యభాషణం

అంటే ఋగ్వేద వినీతుడు అంటే వేదమును గురువు వద్ద అధ్యనం చేసిన వాడు.యజుర్వెద ధారిణుదు అంటే ఉదాత్త అనుదాత్త స్వరాలతో

షడంగా సముపెతమైన వాక్ శుధ్ధి, సందర్భోచిత సమాధానాలు కలిగిన వాడు. సామ వేద విదుషః అంటే శాస్త్ర సంగ్రహుడే కాక గాన

ప్రాధాన్యమైన సామవేదం సాంగోపాంగంగా నేర్చి తన ఊహా వైదుష్యంతో శ్రోతలకు రససిద్ధి కలిగించినవాడు.

మాటకు అంత ప్రాధాన్యత వుంది. అడుగుటలో అణకువ వుండాలి.

మనకు తెలియనివి తప్పులుకావు అన్న తెనాలి రామకృష్ణు ని మాటతో ముగించుతూ నన్ను తప్పుగా తలవ వద్దని తెలుపుకొను చున్నాను .

జ్ఞానము అనంతము. జ్ఞానము అసలే లేనివారు ఎవరూ వుండరు కావున అంతో ఇంతో ఎంతో కొంత అందరమూ జ్ఞానులమే. అట్లని

పరిశోధన లేక విచికిత్స చేయకుండా ఒకరిని తూలనాడుత తప్పు.

ఒకసారి రాయల ఆస్థానమునకు ప్రెగ్గడ నరసరాజు వచ్చి ఇంతవరకు వ్రాసిన కవుల కవిత్వాలలో తప్పులు క్షణంలో పడతానంటాడు కానీ రామకృష్ణుడు ఒక పద్యమిచ్చి తప్పు చూపించమంటే ఏదో ఒక పదము తప్పని చెబుతాడు ప్రెగ్గడ. రామకృష్ణుడు ఆ పదము తప్పుకాదు అని సహేతుకముగా నిరూపించుతాడు. ఆ సందర్భములో ఈ పద్యాన్ని చెబుతాడు:
తెలియనివన్ని తప్పులను దిట్ట తనాన సభాంతరంబునన్
తెలుపగా రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముపడ భాయమేరున్గాక పెద్దలైనవా
రాల నిరసింతువా ప్రెగడరాణ్ణరసా విరసా తుసా బుసా
కావున మన విమర్శా పెదవి దాటకముందే మెదడుకు పంపి జల్లింపబడిన తరువాత (after scanning ) దాటించడము శ్రేయోదాయకము.
ఈ భర్తృహరి పద్యానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత ఒక సారి తిలకించండి .
భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్
భూషణ మే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్

ఇదండీ మాట యొక్క మహిమ

'అనంతో వై వేదాః' అన్నారు ఆర్యులు. అవి కల్గిన భూమిలో పుట్టినందుకు గర్విద్దాం.

మనసు పెట్టి మాట్లాడుతారని ఆశ. మనసారా చదువుతారని అత్యాశ.

శుభమ్ భూయత్

No comments:

Post a Comment