శివ మానస పూజ (ఆది శంకరాచార్య)
ఎందఱో మహనీయులు ఎందరోమహానుభావులు ఎందరు భక్తులు వేరెందరో శ్రేయోభిలాషులు ఇంకెందరో వేద పండితులు శివ మహిమలు శివరాత్రి మహిమలను గూర్చి తెలిపియున్నారు.వానిని ఆచరించ గలిగిన వాళ్ళు ఒకప్రక్క నుండగా చేయలేని నాలాంటి వారు కూడా ఉండటము నిజము.
అటువంటి వారు శివలింగముపై ఒక లోటా నీరు పోసి ఒక బిల్వదళమును పెట్టి ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులచే రచింపబడిన ఈ 5 శ్లోకములను చదువుకొని మనసారా శివునికి నమస్కరించుకొని పరమేస్వరానుగ్రహ ప్రాప్తి పొందుతారని మనసారా ఆకాంక్షించుచున్నాను.
పరమేశ్వరునికి భక్తీ ప్రపత్తులతో కూడిన శోడశోపచారములతో కూడిన ఆత్మనివేదనము ఈ శ్లోకముల సారాంశము.
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||
రత్నమయమైన పీఠము పై విరాజిల్ల జేసి,సాంబశివునికి, హిమజలం అంటే గంగా జలముతో అభిషేకము చేసి దివ్యాంబరములు చుట్టి సువర్ణ మణిభూషలచే అలంకరించి మృగమదము అనగా కస్తూరి కలసిన చందనమునలది ,జాజి ,సంపెంగ,బిల్వ అనగా మారేడు దళములతో అలంకరించి ధూప దీపములను సమర్పించి , దయానిధివైన ఓ సకలచరాచరాధినాథా నేను మానసికముగా అర్పించిన వీనిని స్వీకరించి నన్ననుగ్రహించు స్వామీ అని వేడుకొంటున్నాడు ఈ జీవాత్మ.
సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
రత్న ఖచితమైన బంగారు పాత్రలలో నెయ్యి, పాయసము, పంచభక్ష్యాలు, పాలు పెరుగు అరటిపళ్ళ పానకము ఇంకనూ అనెకవిధములైన శాకపాకములతో శుభ్రమగు జలముతో యథాశక్తి నైవేద్యము మానసికంగా సమర్పించుచున్నాను ప్రభో దయతో స్వీకరించు.
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహళకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
ఛత్రము చామరము(చమరీమృగ కెశములతో చేయబడిన వింజామర)నిర్మలమైన దృశ్యములు, కర్ణపేయమైన చిత్త శాంతిని కల్గించు సంగీతముతో నృత్యముతో, పరమాత్మా,నిన్ను రంజింపజేసి స్తుతించి ,ప్రణుతించి ,సాష్టాంగ నమస్కృతులాచరించి మానసికంగా పైవన్నియూ నీకు సమర్పించి పూజించుకోనుచున్నాను మహాప్రభో.
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
ఆత్మవు నీవు తల్లి పార్వతి మనస్సు సహచరులా ప్రాణములు ఇక శరీరమా అది గృహము పూజ అంటావా నీకే అర్పితమైన నేననుభవించే భోగములే. నిద్రావస్తాయే సమాధి స్థితి . సంచారము నీ ప్రదక్షిణము దుర్గాటములైన గిరులను గూర్చిన తలపులే నీకు నే సమర్పించే స్తోత్ర పాఠములు. నేను పైన తెలిపిన ఏ ఏ కర్మల నాచరించుచున్నానో అవి అన్నియు నీ ఆరాధనముగానే భావించుచున్నాను. నన్ను కటాక్షించు మహాప్రబో !
కరచరణ కృతంవా కర్మ వాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహితమహితంవా సర్వామే తక్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో // 5 //
పరమేశ్వరా నా చేతుల చేతలచే గానీ మనో వాక్కులచే గానీ శ్రవణము చేత గానీ దృష్టి చేతగానీ మనసు చేత గానీ (మనోవాక్కాయకర్మలచే)నీకు తెలిసియో తెలియకనో చేసిన నచ్చునట్టి, నచ్చనట్టి పనుల నన్నిటిని కరుణా సముద్రుడవైన మహాప్రభో క్షమించు.
నాకు తెలిసినది చెప్పుటలో తప్పులు జరిగి వుంటే మిమ్ములను, ఆ పరమేశ్వరుని మనఃపూర్వకముగా క్షమాపణ వేడుకోను చున్నాను. నమస్తే నమస్తే నమస్తె నమః
తత్సత్


  • Write a comment...